
- ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన ముఖ్య నేతల సమావేశాలు
- అభ్యర్థిని ప్రకటిస్తే మిగిలిన నేతల్లో అసంతృప్తి వస్తదని భయం
హైదరాబాద్, వెలుగు: మునుగోడు అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసుకుంది. రెండు రోజులు హడావుడి చేసినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థి ఎంపికకు ఇంకా చాలా సమయం ఉందని, ఈ ఎన్నికల్లో అభ్యర్థి కన్నా పార్టీయే ప్రధానమనే సందేశంతో ముందుకు వెళ్లాలని నేతలు నిర్ణయించారు. ‘మన మునుగోడు, మన కాంగ్రెస్’ నినాదంతో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆశావహులకు సూచించారు. ఈ సమయంలో వివిధ పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోవాలని, ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, నియోజకవర్గంలో అందరికన్నా ముందుండాలని ప్లాన్ చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 1న లేదా తర్వాత అభ్యర్థిని అనౌన్స్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. గురువారం ఉదయం గాంధీభవన్‌లో ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ సెక్రటరీలు బోసురాజు, నదీమ్ జావీద్, రోహిత్ చౌదరి, ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్, మాజీ విప్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం కూడా ముఖ్య నేతలు మునుగోడు ఆశావహులతో సమావేశమై.. సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలో చర్చోపచర్చలు సాగాయి. తదుపరి చర్చలను గురువారానికి వాయిదా వేశారు. కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు. నేతల మధ్య వివాదాలే దీనికి కారణమని తెలుస్తున్నది. అభ్యర్థి ఎంపిక విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోడమే మంచిదని నిర్ణయించినట్లు తెలిసింది. తొందరపడి అభ్యర్థిని ప్రకటిస్తే జంపింగ్‌లకు ఆస్కారం ఇచ్చిన వాళ్లమవుతామని, నియోజకవర్గంలో స్థానిక నేతల్లో కూడా అసంతృప్తి ప్రబలే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.
తొందరపాటు నిర్ణయాలొద్దు
మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమే కాకుండా, ఆ స్థానాన్ని ఖాళీ చేసిన రాజగోపాల్ ముఖ్య నేత కావడంతో తిరిగి ఆ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో తలపడాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. క్యాడర్ బలంగా ఉన్న చోట తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భావించిన నేతలు.. బైపోల్‌కు ఇంకా సమయం ఉన్నందున అభ్యర్థి విషయంలో తొందర పడకూడదని నిర్ణయించినట్లు సమాచారం. కాగా సునీల్ కనుగోలు కూడా గాంధీభవన్‌కు వచ్చి తన నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
రేపటి నుంచి టూర్లు
ఈ నెల 13 నుంచి 20 వరకు మునుగోడు నియోజకవర్గంలో నేతలు టూర్లు ఏర్పాటు చేశారు. ఆజాదీ కా అమృత్ గౌరవ్ యాత్రను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. 13న మునుగోడులో చేయాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 20 నుంచి 30 వరకు ఇంటింటి ప్రచారానికి వెళ్తామని తెలిపారు.
నేను పోటీ చేయను: చెరుకు సుధాకర్
మునుగోడు కాంగ్రెస్ టికెట్ తాను ఆశించడం లేదని, ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తానని చెరుకు సుధాకర్ అన్నారు. గురువారం ఉదయం హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాణిక్కం ఠాగూర్‌తో ఆయన భేటీ అయ్యారు.
కాంగ్రెస్‌ను బతికించుకోవాలి: మధు యాష్కీ
రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్‌ను బతికించుకోవాలని, మునుగోడు ఉప ఎన్నిక తమ పార్టీ భవిష్యత్తు కోసం కాదని, తెలంగాణ బిడ్డల ప్రయోజనం కోసమని మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఉదయం ముఖ్య నేతల భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతున్నదని గ్రహించి టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని, అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికను తీసుకువచ్చాయని ఆరోపించారు. ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 175 గ్రామాల్లో పీసీసీ నాయకులంతా పర్యటిస్తారన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే: రేవంత్
గాంధీభవన్‌లో కాంగ్రెస్ అనుబంధ సంఘాల చైర్మన్లతో జరిగిన సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ.. ‘‘మనకు ఒక కేఏ పాల్ ఉన్నాడు. ఇపుడు ఆర్జీ పాల్ వచ్చాడు. ఆర్జీ పాల్ అంటే రాజగోపాల్. ఈ విషయాన్ని మీరు గ్రామాల్లో ప్రచారం చేయండి. ఆయనను అలాగే పిలవండి” అని చెప్పినట్లు సమాచారం. రాజగోపాల్ కాంట్రాక్టుల కోసమే పార్టీ మారినట్లు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలిసింది. అంతకుముందు మీడియాతో చిట్‌చాట్ చేసిన రేవంత్.. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తాను చెబుతున్న మాటలు రుజువయ్యాయని.. ఏ ఒప్పందం లేకపోతే రాజగోపాల్ రాజీనామాను వెంటనే ఎలా ఆమోదిస్తారన్నారు.